దేశ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ మంచి పేరు సంపాదించుకున్నారు. ఎన్నికల్లో గెలవాలనుకొనే ఏ పార్టీ అయినా సరే ఆయన సాయం కోరే స్థాయికి ఆయన ఎదిగారు. ఐ-ప్యాక్ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) అనే సంస్థను స్థాపించి ఎన్నికల వ్యూహకర్తగా దేశంలోనే ప్రముఖమైన స్థానంలో నిలిచారు. అయితే, అలాంటి ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం ఐ ప్యాక్ నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇక తనకు ఐ ప్యాక్ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని చంద్రబాబును కలిసిన సందర్భంగా మీడియాతో చెప్పారు. అదే సమయంలో ‘ఎక్స్’ ద్వారా ఐ ప్యాక్ సంస్థ స్పందిస్తూ.. తమ పొలిటిక్ స్ట్రేటజీ సేవలు వైఎస్ఆర్ సీపీకి కొనసాగుతాయని స్పష్టం చేసింది. దీంతో పీకే తన సొంత ఐ ప్యాక్ నుంచి తప్పుకోవడం ఏంటని చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.
ఐ ప్యాక్ కు ప్రస్తుతం ముగ్గురు వ్యక్తులు డైరెక్టర్లుగా ఉన్నారు. రిషి రాజ్ సింగ్, ప్రతీక్ జైన్, వినేశ్ చందేల్ అనే వారు డైరెక్టర్లు అయినప్పటికీ వీరు పేర్లు ఎక్కడా అంతగా తెలియవు. అయితే ప్రశాంత్ కిషోర్ ఈ ఐ ప్యాక్ నుంచి తన వాటాతో వైదొలిగినట్లు సమాచారం. ఐ ప్యాక్ ను తొలుత మొదలు పెట్టింది ప్రశాంత్ కిషోర్. నిజానికి 2013లో సిటిజెన్స్ పర్ అకౌంటబుల్ గవర్నెన్స్ (సీఏజీ) అనే పేరుతో ప్రశాంత్ కిషోర్ దీన్ని మొదలుపెట్టారు. 2014లో మోదీ కోసం రాజకీయ వ్యూహకర్తగా పని చేశారు.
మోదీ చేసే చాయ్ పే చర్చా, రన్ ఫర్ యూనిటీ, మంథన్ సోషల్ మీడియా ప్రోగ్రామ్స్ లాంటి వినూత్న మార్కెటింగ్ ప్రచారాన్ని రూపొందించిన ఘనత ప్రశాంత్ కిషోర్‌కు దక్కింది. తర్వాత మోదీ నుంచి విడిపోయి సీఏజీ సంస్థనే ఐ-ప్యాక్ గా మార్చారు. 2015లో బిహార్ సీఎం నితీష్ కుమార్, 2017లో అప్పటి పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, యూపీలో కాంగ్రెస్‌కు, ఏపీ సీఎం జగన్, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ లాంటి వారికి రాజకీయ వ్యూహకర్తగా పని చేసి వారిని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.
అయితే, తాజాగా ఐ ప్యాక్ సంస్థ నుంచి ప్రశాంత్ కిషోర్ పూర్తిగా వైదొలగడంతో ఐ ప్యాక్ సంస్థ భవితవ్యం ప్రశ్నార్థకం అయింది. ఇన్నాళ్లు పీకే సమర్థతతోనే ఐ ప్యాక్ కు మంచి పొలిటికల్ కన్సల్టెన్సీగా పేరుండేది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వైదొలగడంతో ఐ ప్యాక్ సంస్థ డమ్మీగా మారనుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అలాంటి ఐ ప్యాక్ సంస్థ ఏపీలో జగన్మోహన్ రెడ్డికి ఇంకా పొలిటికల్ స్ట్రేటజీ సేవలు అందిస్తోంది. ఇక పీకే నేతృత్వం ఐ ప్యాక్ టీమ్ కు లేకపోవడంతో జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా ఈ ఎన్నికల తర్వాత దానికి టాటా చెప్పే అవకాశాలు ఉన్నాయి. అంతేకాక, పీకే లేని ఐ ప్యాక్ ను దేశంలోని మరే ఇతర పార్టీ కూడా పొలిటికల్ కన్సల్టెన్సీగా నియమించుకొనే సూచనలు కనిపించడం లేదు. దీంతో ఇక ఐ ప్యాక్ పని అయిపోయినట్లే అనే వాదన వినిపిస్తోంది.