తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హాట్ టాపిక్. భారత్ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతోంది. 3 పార్టీల అభ్యర్థులు ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్యే పోటీ నెలకొంది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగారు. హైదరాబాద్ నగరంలో తొలి అసెంబ్లీ సీటు గెలుచుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ నేతలు ప్రచార బాధ్యతలు చేపట్టారు. ఇక బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రంగంలోకి దిగారు.
Also Read : చావులోను ఆగని విష ప్రచారం.. కులాలను లాగుతోన్న వైసీపీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం ప్రభావం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికపై ఉంటుంది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం నేరుగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. గెలుపు బాధ్యతను మంత్రులకు అప్పగించారు. డివిజన్ల వారీగా కేటాయించారు. ఇదే సమయంలో పార్టీ హై కమాండ్ పెద్దలతో చర్చించారు. సర్వే నివేదికల ఆధారంగా సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. బీఆర్ఎస్ తరఫున ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు జోరుగా ప్రచారం చేస్తున్నారు. దీంతో రేవంత్ కూడా ప్రచారం చేసేందుకు రెడీ అయ్యారు. నవీన్ గెలుపు బాధ్యతను రేవంత్ తన భుజానికెత్తుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పరిధిలో ఒక్కో విభాగం బాధ్యతలను మంత్రులకు అప్పగించారు. సినీ పరిశ్రమ బాధ్యతను మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు అప్పగించారు.
Also Read : అమ్మో గుంటూరు ఎస్పీ.. టూ వీలర్స్ విషయంలో కఠినంగా వకుల్ జిందాల్
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 28న సీఎం రేవంత్ రెడ్డి యూసుఫ్‌గూడలో పర్యటించనున్నారు. పోలీస్ గ్రౌండ్స్‌లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్, 24 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మరో 4 రోజుల పాటు నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. ఈ నెల 30, 31 తేదీలతో పాటు నవంబర్ 4, 5 తేదీల్లో కూడా నియోజకవర్గంలో రేవంత్ రోడ్ షో ప్లాన్ చేశారు. ఇదే సమయంలో బీహార్ ఎన్నికల్లో కూడా రేవంత్ ప్రచారం చేయనున్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్నారు ఆ పార్టీ నేతలు. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం 18 నెలల కాంగ్రెస్ పాలన గురించి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. దీంతో రేవంత్ స్వయంగా రంగంలోకి దిగారు.




