అనుకున్నంత అయ్యింది. 3 నెలలుగా జరుగుతున్న పంచాయతీకి ఇప్పుడు ఫుల్ స్టాప్ పడింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు భారత రాష్ట్ర సమితి అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఇంతకాలం పక్కలో బల్లెం మాదిరిగా ఉన్న కవితపైన సస్పెన్షన్ వేటు వేశారు.
Also Read : అప్పుడు ఎక్కడ ఉన్నారు సార్..? రామచంద్ర యాదవ్ పై విమర్శలు
గతేడాది మార్చి నెలలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత 5 నెలల పాటు తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు కవిత. బెయిల్‌పైన జైలు నుంచి విడుదలైన తర్వాత కొద్ది రోజుల పాటు కవిత సైలెంట్‌గానే ఉన్నారు. ఆ తర్వాత పార్టీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కవిత అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో కేసీఆర్‌కు లేఖ రాశారనే విషయం పెద్ద దుమారం రేపింది. దీనిపై అమెరికా నుంచి వచ్చిన వెంటనే కవిత కూడా లేఖ తానే రాసినట్లు ఒప్పుకున్నారు. అప్పటి నుంచే అన్నాచెల్లెళ్ల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది.
ముందుగా పార్టీలో మాజీ మంత్రులపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కవిత.. అదే సమయంలో తన తెలంగాణ జాగృతిని బలోపేతం చేసే పని ప్రారంభించారు. ఆ తర్వాత పార్టీని బీజేపీలో కలిపేందుకు ప్లాన్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత నుంచి అన్న కేటీఆర్‌కు దూరమయ్యారు. ఆ తర్వాత పార్టీలో ఒక్కొక్కరిపై కవిత విమర్శలు చేశారు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న కాంగ్రెస్ పార్టీ ఆరోపణలకు బలం ఇచ్చేలా.. నేరుగా హరీష్ రావు, సంతోష్ కుమార్‌పైనే ఆరోపణలు చేశారు. వీటిని సీరియస్‌గా తీసుకున్న కేసీఆర్.. ఫామ్ హౌస్‌లో అత్యవసర సమావేశం నిర్వహించారు.
Also Read : అవినాష్ చెప్తేనే అన్న అపాయింట్మెంట్..?
నిన్నటి నుంచే కవితపై చర్యలు తప్పవనే పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే గారాల పట్టీపై కేసీఆర్ అంత కఠినమైన నిర్ణయం తీసుకోరన పార్టీలో కొందరు నేతలు వ్యాఖ్యానించారు కూడా. కానీ కవితపై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే.. మరోసారి పార్టీలో నేతలపై ఆరోపణలు చేసే అవకాశం ఉంటుందని.. అప్పుడు సొంత పార్టీ కార్యకర్తలు, నేతల్లో కూడా భయం పోతుందని భావించారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వేటు ఖాయమనే సంకేతాలు ఇచ్చారు బీఆర్ఎస్ పెద్దలు.