ఒక్క ఉప ఎన్నిక… అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంకా చెప్పాలంటే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది పరువుతో కూడుకున్న ఎన్నిక. అటు ప్రతిపక్షంలో ఉన్న భారత రాష్ట్ర సమితికి కూడా చావో రేవో తేల్చుకునే పరిస్థితి. మరోవైపు అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతున్న భారతీయ జనతా పార్టీకి కూడా ఈ ఎన్నిక అత్యంత కీలకం. త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికలో సత్తా చాటాలంటే.. బై పోల్‌లో గెలుపు ముఖ్యమని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నికపైనే అందరూ దృష్టి పెట్టారు. దీంతో ఈ ఎన్నికలో పోటీ చేసేందుకు సెలబ్రెటీలు క్యూ కడుతున్నారు.
Also Read : రాజమౌళి – మహేష్ స్టోరీ లీక్ చేసిన ఆఫ్రికా మీడియా
తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున తొలిసారి పోటీ చేసిన మాగంటి గోపీనాథ్.. 9 వేల పై చిలుకు ఓట్లతో విజయం సాధించారు. ఆ తర్వాత కేసీఆర్ సారధ్యంలోని టీఆర్ఎస్‌లో చేరారు. ఆ తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్థన్ రెడ్డిపై ఏకంగా 16 వేల ఓట్ల తేడాతో గెలిచారు. 2023లో కూడా బీఆర్ఎస్ తరఫున అదే జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ సాధించారు గోపీనాథ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానం నాగేందర్ వంటి పలువురు బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీలో చేరారు. దీంతో మాగంటి కూడా పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ.. మాగంటి మాత్రం.. వాటిని కొట్టిపారేశారు. అయితే ఇదే సమయంలో సొంత పార్టీలోనే మాగంటికి వ్యతిరేకంగా పలువురు నేతలు బహిరంగంగా విమర్శలు చేయడం పెద్ద దుమారం రేపింది.
Also Read : అసలు.. వాళ్లిద్దరు ఎందుకు కలిశారు.. కారణాలేమిటీ..?
ఇక మాగంటి ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగనుంది. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ.. జంట నగరాల్లో ఆ పార్టీకి కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. దీంతో ఈ ఉప ఎన్నికను రేవంత్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా సరే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలవాలని గట్టి పట్టుదలతో ఉంది. ఇందుకోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఉప ఎన్నికలో అభ్యర్థి కోసం హస్తం పార్టీ నేతలు కసరత్తు ప్రారంభించారు. ఈ టికెట్ కోసం విష్ణువర్థన్ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ, వెటరన్ క్రికెటర్ అజారుద్దీన్ కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి తనకు ఇస్తే.. రేసు నుంచి తప్పుకుంటా అని పార్టీ పెద్దలతో చెప్పినట్లు సమాచారం. ఇక బీజేపీ తరఫున ఒకరిద్దరి పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. ఈ స్థానాన్ని ఎన్డీయే కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీకి కోరుతోంది. ఇక్కడ నుంచి నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసినిని బరిలో నిలిపాలని టీడీపీ భావిస్తోంది. అటు సిట్టింగ్ స్థానం నిలబెట్టుకునేందుక బీఆర్ఎస్ కూడా గట్టిగానే కృషి చేస్తోంది. ఈ ఎన్నికలో ఓడితే.. ఆ ప్రభావం గ్రేటర్ ఎన్నికపై స్పష్టంగా ఉంటుందనేది కారు పార్టీ నేతల అభిప్రాయం. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తరఫున మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులను పోటీలో ఉంచాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
Also Read : పాపం ఆయన సంగతేంటి..? మాజీ సీఎం ఎదురు చూపులు..!
ఇదే సమయంలో మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దిల్ రాజును ఎఫ్‌డీసీ చైర్మన్‌ను చేశారు. జూబ్లీహిల్స్ పరిధిలో ఎక్కువగా సినీ పరిశ్రమకు చెందిన వాళ్లే ఉన్నారు. పరిశ్రమకు చెందిన సెలబ్రేటీల మొదలు.. జూనియర్ ఆర్టిస్టులు, పరిశ్రమ కార్మికులు కూడా ఈ నియోజవర్గం పరిధిలోనే ఉన్నారు. దీంతో దిల్ రాజు గెలుపు సునాయాసం అవుతుందనేది అటు పొలిటికల్ సర్కిల్‌లో, ఇటు సినీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. దిల్ రాజు ప్రస్తుతం సినీ పరిశ్రమలో అన్ని విభాగాల్లో గట్టి పట్టున వ్యక్తి. అందరు పెద్ద హీరోలు, నటులతో పాటు వ్యాపారులతో కూడా దిల్ రాజుకు సత్సంబంధాలున్నాయి. ఇవే దిల్ రాజును అసెంబ్లీ వైపు అడుగులు వేయిస్తాయనేది ఆయన సన్నిహితుల మాట. మరి ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారనేది మాత్రం ఇప్పటికీ క్లారిటీ రాలేదు.