కిందిస్థాయిలో ఎన్ని గొడవలున్నా సరే.. పై స్థాయిలో మాత్రం అంతా చాలా బాగుంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తు కారణంగా ఏపీలో భారీ విజయం నమోదు చేసింది. 175 స్థానాల్లో పోటీ చేసిన కూటమి… ఏకంగా 164 స్థానాలను గెలుచుకుంది. అయితే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కిందిస్థాయి నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం కొరవడింది. మా వల్లే గెలిచామని 3 పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించుకుంటున్నారు కూడా. ఇక నామినేటెడ్ పదవుల కేటాయింపులో కూడా తమకు ప్రాధాన్యత ఇవ్వలేదనేది బీజేపీ నేతల మాట. ఇటీవల బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు కూడా ఇదే ఆరోపణ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు మెజారిటీ సీట్లు ఇవ్వాల్సిందే అని డిమాండ్ కూడా చేశారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం కూడా రేపాయి. ఒకదశలో కూటమిలో విభేదాలు అని సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అయ్యాయి.
Also Read : సినిమాల్లోకి మరో మాజీ స్టార్ క్రికెటర్
కూటమి పార్టీలు మరో 15 ఏళ్ల పాటు కలిసే ఉంటాయని 3 పార్టీల అగ్రనేతలు పదే పదే చెబుతున్నారు. ఇటీవల మార్కాపురంలో జరిగిన బహిరంగ సభలో కూడా జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఇదే మాట చెప్పారు. 3 పార్టీల మధ్య పొత్తు కొనసాగుతుందన… మరో 15 ఏళ్ల పాటు కూటమి సర్కార్ అధికారంలో ఉంటుందన్నారు. కూటమి గెలుపు ఓ ఒక్కరి వల్ల కాదన్నారు పవన్. ఒకరికొకరం అందరికీ అవసరమని.. అన్ని వేళ్లు కలిస్తేనే పిడికిలి.. కూటమి అంటే పిడికిలి అన్నారు. ప్రజలకు న్యాయం చేయడమే కూటమిలో ప్రతి ఒక్కరి కర్తవ్యం అన్నారు పవన్. అదే సమయంలో కొత్త కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు కొన్ని సమస్యలుంటాయని.. వారి సరి చేసుకోవాలని.. సరిదిద్దుకుని ముందుకు పోవాలని సూచించారు పవన్.
Also Read : కష్టాల క్రికెట్.. ఆకాష్ దీప్ జీవితంలో వరుస విషాదాలు
నామినేటెడ్ పదవుల కోసం నేతలు తగవులు పడుతున్న సమయంలో.. ఢిల్లీ బీజేపీ పెద్దలు కూటమికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కూటమిలోని టీడీపీ సీనియర్ నేతకు గౌరవప్రదమైన పదవి ఇచ్చేందుకు ఢిల్లీ పెద్దలు రెడీ అయ్యారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే రెండు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు. అయితే.. వీటితో పాటు మరో కీలక పదవి ఇవ్వాలని కాషాయ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని బీజేపీకి కేటాయించారు చంద్రబాబు. ఇందుకు ప్రతిఫలంగా టీడీపీకి గవర్నర్ పదవి ఇవ్వాలని బీజేపీ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇద్దరు సీనియర్ నేతల పేర్లను టీడీపీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో 7వ తరగతి బాలిక చిచ్చు
రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ పెద్దలు ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించారు. ఇందుకోసం అవసరమైన అన్ని మార్గాలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. పార్టీ అధ్యక్షునితో సహా అన్ని నియామకాల్లో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు అగ్రనేతలు. మిత్రపక్షాలకు పదవులు కేటాయించడం ద్వారా రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నట్లుంది. ఎన్డీయేలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న పార్టీలకు కేంద్ర మంత్రి పదవులు, గవర్నర్ పదవులు ఇవ్వాలని బీజేపీ పెద్దల ఆలోచన. తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు, కంభంపాటి హరిబాబులను ఇప్పటికే గవర్నర్‌లుగా నియమించారు. ఇప్పుడు ఎన్టీయే కూటమిలోని టీడీపీ నేతకు కూడా గవర్నర్ పదవి ఇవ్వాలని నిర్ణయించారు.
Also Read : భారతీయులకు దుబాయ్ గుడ్ న్యూస్..!
టీడీపీ తరఫున ఇద్దరు సీనియర్ నేతల పేర్లు విస్తృతంగా వినిపిస్తున్నాయి. ఒకరు ఉత్తరాంధ్రకు చెందిన అశోక్ గజపతి రాజు కాగా.. మరొకరు యనమల రామకృష్ణుడు. ఈ ఇద్దరిలో ఒకరికి గవర్నర్ గిరి ఖాయంగా కనిపిస్తోంది. ఇద్దరు నేతలు తొలి నుంచి టీడీపీతోనే ఉన్నారు. అన్ని సమయాల్లో చంద్రబాబుకు అండగా నిలిచారు. ఇద్దరూ ఆర్థిక శాఖ మంత్రులుగా వ్యవహరించిన వారే. ఇద్దరు నేతలకు గత ఎన్నికల్లో టికెట్ నిరాకరించిన చంద్రబాబు.. ఇద్దరి కుమార్తెలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అశోక్ కుమార్తె అదితి విజయనగరం ఎమ్మెల్యేగా, రామకృష్ణుడు కుమార్తె దివ్య తుని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతలు పోలిట్‌బ్యూరోలో సభ్యులుగా ఉన్నారు. 2014 ఎన్డీయే ప్రభుత్వంలో అశోక్ కేంద్ర మంత్రిగా పని చేసిన అనుభవం కూడా ఉంది. ఇటీవల ఎమ్మెల్సీగా పదవీ విరమణ చేసిన యనమల.. తనకు రాజ్యసభు అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరారు. లేదంటే రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని తన అభిమానుల వద్ద వ్యాఖ్యానించారు కూడా. ఈ నేపధ్యంలో ఇద్దరు నేతల్లో ఎవరికి చంద్రబాబు ఎంపిక చేస్తారనేది ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్.