అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ఓడినప్పుడు మరోలా.. ఇదే వైసీపీ మార్కు రాజకీయం. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది. వైసీపీ ఓడిన వెంటనే.. జగన్ తన మకాం తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు యలహంక ప్యాలెస్‌కు మార్చేశారు. ఆ తర్వాత ఏపీ ప్రజలు తనని మర్చిపోతారేమో అనే భయంతో అప్పుడప్పుడు వచ్చి హంగామా చేసి పోతున్నారు. ఇలా వచ్చిన వాటిల్లో చాలా వరకు పరామర్శలే తప్ప ప్రజా సమస్యలపై పోరాటం చేసిన సందర్భాలు ఒకటి కూడా లేవు. జైల్లో ఉన్న తన పార్టీ నేతలను, గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లను, శవ పరామర్శలు తప్ప.. జగన్ ఏ రోజూ బయటకు రాలేదు. ఆ సమయంలో కూడా పరామర్శల ముసుగులో తన బలప్రదర్శనే చూపించారనేది జగన్‌పై ప్రధాన ఆరోపణ. అదే మాదిరిగా చేసిన మరో ప్రయత్నాన్ని పోలీసులు తిప్పి కొట్టడంతో ప్లాన్ బెడిసికొట్టిందని కలవరపడుతున్నారు.
Also Read : మిడిల్ క్లాస్ కు కేంద్రం గుడ్ న్యూస్.. తగ్గే ధరలు ఇవే
వై నాట్ 175 అని గొప్పగా చెప్పిన జగన్‌కు.. చివరికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. దీంతో అసెంబ్లీకి రావడానికి కూడా జగన్‌కు ముఖం చెల్లడం లేదు. అందుకే తనను ప్రభుత్వం గుర్తించలేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాటి నుంచి ఒక్కసారి కూడా ప్రజా సమస్యలపై జగన్ మాట్లాడిన సందర్భాలు లేవు. అయితే ఇదే సమయంలో వైసీపీ నుంచి కీలక నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెబుతుండటంతో.. తప్పని పరిస్థితుల్లో జగన్ బయటకు వచ్చారు. మొదట్లో నెలకోసారి వచ్చిన జగన్.. ఇప్పుడు మాత్రం రెండు వారాలకోసారి వచ్చి హడావుడి చేస్తున్నారు. పరామర్శల పేరుతో తనకు తొలి నుంచి కలిసి వచ్చిన రాజకీయాన్నే చేస్తున్నారు జగన్. వినుకొండ, రాప్తాడు, తెనాలి, సత్తెనపల్లి, మార్కాపురం నియోజకవర్గాల్లో పరామర్శ పేరుతో బలప్రదర్శన చేశారు జగన్. తనకు ప్రజల్లో అభిమానం ఇంకా తగ్గలేదని చూపించే ప్రయత్నం చేశారు.
వాస్తవానికి జగన్ పర్యటన అంటే.. అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది పరదాలు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పూర్తిగా పరదాల మధ్యలోనే పర్యటించారు. చివరికి విజయవాడ నగరానికి వచ్చినప్పుడు కూడా బెంజ్ సర్కిల్ పరిసరాల్లో పరదాలు కట్టారు. ఇక జగన్ పర్యటన అంటే చాలు.. రెండు రోజుల పాటు అన్ని దుకాణాలు బంద్. బారికేడ్లు పెట్టారు. చెట్లు కొట్టేశారు. చిన్న చిన్న బడ్డీ కొట్లను తొలగించారు. ఆ మార్గంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. ఏ ఒక్కరు రాకుండా ఓవర్‌గా యాక్షన్ తీసుకున్నారు. గన్నవరం నుంచి తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లే మార్గంలో ప్రసాదం పాడు వద్ద మురుగు వాసన వచ్చిందని.. కాలువపైన 2 కోట్లు ఖర్చు చేసి రేకులు వేయించిన ఘనత జగన్‌కే దక్కుతుంది. అలా పరదాల చాటున సాగిన ప్రయాణించినందుకే ఏపీ ప్రజలు జగన్‌కు 11 సీట్లు మాత్రమే ఇచ్చారు.
Also Read : షెఫాలి మరణానికి యాంటీ ఏజింగ్ మందులే కారణమా..?
అయితే జగన్ మాత్రం.. తమ పార్టీకి 40 శాతం ఓట్లు వచ్చాయని.. కేవలం ఈవీఎం వల్లే కూటమి పార్టీలు గెలిచాయని పదే పదే ఆరోపణలు చేశారు. అందుకు సాక్ష్యంగా తన పర్యటనలకు వస్తున్న జనాన్ని చూపిస్తున్నారు. రాప్తాడులో పర్యటించిన సమయంలో హెలికాఫ్టర్ డ్యామేజ్ చేశారు. పొదిలి పర్యటనలో మహిళలు, పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఇక సత్తెనపల్లి పర్యటన సమయంలో అయితే సింగయ్య అనే వ్యక్తి జగన్ కారు కిందే పడి మృతి చెందాడు. దీంతో జగన్ పర్యటన పైన పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. వాస్తవానికి సత్తెనపల్లి పర్యటనలోనే పోలీసులు వంద మందికే అనుమతి ఇచ్చారు. కానీ జగన్ మాత్రం వందల కార్లతో ర్యాలీ నిర్వహించి ముగ్గురు మరణానికి కారణమయ్యారు.
సింగయ్య మృతితో వచ్చిన డ్యామేజ్ కవర్ చేసుకునేందుకు వైసీపీ నేతలు వెంటనే మరో యాత్రకు సిద్ధమయ్యారు. జగన్‌కు జనంలో క్రేజ్ తగ్గలేదని రుజువు చేసేందుకు నెల్లూరు పర్యటన ప్లాన్ చేశారు. ఎప్పుడో నెల రోజుల క్రితం అరెస్టు అయిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనను పరామర్శించేందుకే జగన్ నెల్లూరు జిల్లా పర్యటన ప్లాన్ చేశారు. ఈ పర్యటనకు అధికారులు అనుమతి ఇచ్చినా కూడా ఆకస్మికంగా రద్దు చేసుకున్నారు జగన్. అయితే ఈ రద్దు వెనుక ప్రభుత్వం కుట్ర ఉంది అనేది వైసీపీ నేతల మాట. మాజీ ముఖ్యమంత్రి పర్యటనకు ప్రభుత్వం కనీస ఏర్పాట్లు చేయలేదని.. జగన్‌ను చూసి ప్రభుత్వం భయపడుతోందన్నారు. భద్రత కల్పించడంలో విఫలమైందని కూడా ఆరోపించారు. వాస్తవానికి పర్యటన రద్దు చేసుకుంది జగన్. ప్రభుత్వం తరఫున అధికారులు అనుమతి మంజూరు చేశారు. అయితే ఇక్కడే అసలు విషయాన్ని వైసీపీ నేతలు పక్కన పెట్టారు. పర్యటన రద్దు వెనుక అసలు కారణం హెలీప్యాడ్. నెల్లూరు సెంట్రల్ జైలు సమీపంలోనే వెంకటాచలం వద్ద పోలీసులు హెలీప్యాడ్‌కు ఏర్పాట్లు చేశారు. అక్కడ హెలికాఫ్టర్ దిగితే.. నేరుగా జైలుకు వెళ్లి పరామర్శించి బయటకు రావచ్చు. కానీ వైసీపీ నేతలు మాత్రం.. వెంకటాచలంలో వద్దు.. సెయింట్ ఆన్స్ స్కూల్ ప్రాంగణంలోనే హెలీప్యాడ్ కావాలని పట్టుబట్టారు. జైలుకు స్కూల్ 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి.. అక్కడ నుంచి జైలు వరకు భారీ ర్యాలీ నిర్వహించాలనేది వైసీపీ నేతల ప్లాన్. కానీ పోలీసులు మాత్రం ససేమిరా అనేశారు. వెంకటాచలం వద్ద దిగితే.. ఎలాంటి ర్యాలీ చేయాల్సిన అవసరం లేదు. రెంటపాళ్లలో జరిగిన ప్రమాదాల వల్లే పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం… ర్యాలీగా వెళ్లాల్సిందే.. పరామర్శ చేయాల్సిందే అని పట్టుబట్టారు. దీంతో ఈ పర్యటనకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
Also Read : రేవంత్ రెడ్డి – ఆరా మస్తాన్ ఫోన్ ట్యాపింగ్.. ఆధారాలతో బయటపెట్టిన సిట్
జగన్ జైలుకు వెళ్లి పరామర్శించడం ఇది కొత్తేమి కాదు. విజయవాడ జిల్లాలో వల్లభనేని వంశీని, నెల్లూరు సెంట్రల్ జైలులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, గుంటూరు జైలులో మాజీ ఎంపీ నందిగాం సురేష్‌ను జగన్ పరామర్శించారు. ఆ మూడు సందర్భాల్లో ఎలాంటి ర్యాలీలు చేయలేదు. అప్పుడు పోలీసులు సూచించినట్లుగానే నేరుగా జైలుకు వెళ్లి.. పరామర్శించిన తర్వాత.. జైలు బయట అదే పోలీసులను బట్టలూడదీస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం.. ర్యాలీ చేయాలనే ఆలోచనతోనే తన పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వటం లేదని ఆరోపిస్తున్నారు. ర్యాలీ చేస్తే.. జనం భారీగా వస్తారని.. అది చూసి టీడీపీ నేతలు భయపడుతున్నారనేది వైసీపీ నేతల మాట. ఇదే అసలు సిసలు రాజకీయం అంటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.