చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిందని సంతోష పడాలో.. లేక తమకు పదవులు రాలేదని బాధపడాలో అర్థం కాక కొంతమంది నేతలు సతమతమవుతున్నారు. ఎన్నికల్లో సీటు తమకే వస్తుందని ఐదేళ్ల పాటు కష్టపడి పని చేసిన నేతలు కూడా.. చివరి నిమిషంలో టికెట్ రాకపోవడంతో నిరాశకు గురయ్యారు. అయితే అధినేత హామీ మేరకు ఎన్నికల్లో కష్టపడి పనిచేశారు. కానీ.. ఏడాది దాటినా ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో అసలు పదవి వస్తుందా.. రాదా.. అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తుంటే.. అసలు నేను పార్టీలో ఉన్నానా.. లేదా అనేది మరికొందరి ప్రశ్న. కొందరు సీనియర్లు అయితే.. పార్టీలో ఎందుకున్నామా అని తమ సన్నిహితుల దగ్గర వాపోతున్నారు కూడా.
Also Read : ఇజ్రాయిల్ కు చుక్కలు చూపిస్తున్న ఇరాన్.. యుద్ధం మొదలు
ఐదేళ్ల పాటు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయ పెద్దలు ఏం చెబితే అదే చేశారు. అధినేత వెన్నంటే ఉన్నారు. నాటి వైసీపీ సర్కార్‌ను ఎదిరించారు. దేవినేని ఉమామహేశ్వర్రావు వంటి నేతలపై నాటి వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసింది. హత్యాయత్నం కేసులో అరెస్టు కూడా చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచారు నాటి ప్రభుత్వ పెద్దలు. ఇక ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన డాక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డిపై అయితే ఏకంగా హత్యాయత్నం కూడా చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం నాటి ప్రభుత్వాన్ని నిలదీశారనే అక్కసుతో ఏకంగా 22 కేసులు పెట్టారు. ఇలా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పార్టీ సీనియర్ నేతలు కూడా గత ప్రభుత్వ పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు.
Also Read : తెలంగాణలో బీజేపీ షాకింగ్ సర్వే.. టార్గెట్ రేవంత్ కాదా..?
అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ న్యాయం చేస్తా అని చంద్రబాబు హామీ ఇచ్చారు. అదే సమయంలో పొత్తు కారణంగా కొంతమందికి టికెట్లు ఇవ్వలేక పోతున్నా అని చెప్పిన చంద్రబాబు.. అలాంటి వారికి ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులతో గౌరవిస్తానని హామీ ఇచ్చారు కూడా. స్వయంగా అధినేత హామీ ఇవ్వడంతో ఎన్నికల సమయంలో కార్యకర్తలకు సర్దిచెప్పుకున్నారు. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పని చేశారు. పార్టీ గెలిచింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. అయినా సరే తమకు ఇంకా పదవి రాలేదని నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మైలవరం టికెట్ ఆశించిన దేవినేని ఉమా ప్రస్తుతం పార్టీలో సైలెంట్ అయ్యారు. ఎమ్మెల్సీ అన్నారు.. తర్వాత ఎంపీ అని కూడా అన్నారు.. కానీ ఏదీ రాలేదు. ఉక్కు ప్రవీణ్‌కు, శ్రీకాకుళం, పాతపట్నం మాజీ ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, కలమట వెంకటరమణకు నామినేటెడ్ పదవులు ఖాయమన్నారు. కానీ అసలు ఆ ఊసే లేకుండా పోయింది.
Also Read : తండ్రీ కొడుకులకు మూడిందా..? మంత్రి సంచలనం
పార్టీ అనుబంధ సంఘాల నేతలందరికీ ఏదో ఒక పదవి వచ్చినప్పటికీ.. తనకు మాత్రం రాలేదనేది డ్వాక్రా సాధికార సమితి అధ్యక్షురాలు ఆచంట సునీత ఆవేదన. చంద్రబాబు స్వయంగా ఇచ్చిన హామీ ఎప్పుడు అమలవుతుందా అని మాజీ ఎమ్మెల్యే వర్మ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఓ వైపు పార్టీ గెలిచి ఏడాది పూర్తైన సందర్భంగా నేతలంతా సంబరాలు జరుపుకుంటుంటే.. పదవులు రాలేదనే బాధలో కొందరు నేతలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. తమ సహచరులంతా అధికారంలో ఉండటంతో.. మరి మనకెప్పుడు ఆ యోగం అని సహచరుల వద్ద వాపోతున్నారు కూడా. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరు నేతలతో వరుస సమీక్షలు నిర్వహించిన అధినేత చంద్రబాబు.. ఇప్పుడు కనీసం తమకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వటం లేదని నిరాశ చెందుతున్నారు కూడా. మరి ఇలాంటి అసంతృప్తులను లోకేష్ బుజ్జగిస్తారా లేదా అనేది ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్.