తెలంగాణలో అధికారం కోసం ఎదురుచూస్తున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అక్కడ ఉన్న అన్ని అవకాశాలను అన్వేషిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే విషయంలో కాస్త బీజేపీ నేతలు ఈ మధ్యకాలంలో వెనకబడ్డారు. భారత రాష్ట్ర సమితి నుంచి పలువురు నాయకులు పదేపదే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న సరే బిజెపి మాత్రం సైలెంట్ గా ఉంటుంది. బిఆర్ఎస్ లో కూడా గతంలో మాదిరిగా ఆ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు ముందుకు రావడం లేదు.
Also Read : పార్ట్ టైం బౌలర్ ఎక్కడ..? భారత జట్టుకు ఇదే సమస్య
ఇక బిజెపి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పాటుగా జనసేన పార్టీతో కూడా కలిసి తెలంగాణలో ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి ఈ అంశం గురించి ఆ పార్టీ అగ్ర నాయకత్వం క్లారిటీ కూడా ఇచ్చింది. ఇటీవల చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వెళ్లిన సమయంలో దీని గురించి చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇది పక్కన పెడితే.. తెలంగాణలో బిజెపి సర్వేలు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అన్ని జిల్లాల్లో సర్వే చేసి ఎక్కడ తమ పార్టీ బలంగా ఉంది లేదంటే టిడిపి క్షేత్రస్థాయిలో ఎక్కడ బలంగా ఉంది అనే అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది.
Also Read : తల్లికి వందనంపై విమర్శలు అందుకే రాలేదా..?
ప్రభుత్వ వ్యతిరేకత లేదంటే పథకాల అమలు తీరు వంటి అంశాల గురించి కాకుండా.. కేవలం ఎన్డీఏ కూటమి పోటీ చేసే అంశాలకు సంబంధించి సర్వే నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఓ ప్రముఖ సంస్థ ఈ సర్వే కార్యక్రమాన్ని పూర్తి చేస్తుందట. దాదాపు 12 ప్రశ్నలతో ఈ సర్వే కొనసాగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటుగా నల్గొండ, వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న ఈ సర్వే త్వరలోనే పూర్తయితే ఆ తర్వాత మూడు పార్టీలు కూర్చుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. సర్వే రిపోర్టును మూడు పార్టీలు అధినేతలు పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకొనున్నారు.