దక్షిణాది రాష్ట్రాల మధ్య నిత్యం నీటి తగవులు సర్వ సాధారణం. తమిళనాడు – కర్ణాటక మధ్య కావేరీ జల వివాదం, ఏపీ – తెలంగాణ మధ్య కృష్ణా నది జలాల కేటాయింపు, కర్ణాటక – కేరళ మధ్య కూడా ముళ్లపెరియార్ డ్యామ్ వివాదం.. వీటితో పాటు కర్ణాటక – తమిళనాడు మధ్య బాషాపరమైన విభేదాలు. తాజాగా మరో అంశం కూడా ఇప్పుడు అంతర్రాష్ట్ర వివాదానికి తెర లేపింది. ఈ వివాదం కారణంగా రెండు రాష్ట్రాల మధ్య వాణిజ్య ఒప్పందాలు కూడా దెబ్బ తినే పరిస్థితి తలెత్తింది. ఒక జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పక్క రాష్ట్ర సీఎం.. మీ ఉత్తర్వులు వెనక్కి తీసుకోకపోతే.. మేము కూడా ఆంక్షలు పెడతామని వార్నింగ్ కూడా ఇస్తున్నారు.
Also Read : చంద్రబాబు తరఫున జగన్ ప్రచారం..!
ఏపీలో కూటమి సర్కార్ ఏడాది పాలన ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చామని.. అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నామని..పెట్టుబడులు కూడా వస్తున్నాయని కూటమి నేతలు గొప్పగా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఏపీ సీఎం చంద్రబాబుకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాసిన లేఖ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. ఆ లేఖలో రైతుల సమస్యలు, వాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే అధికారులు అనాలోచితంగా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయన్నారు కర్ణాటక సీఎం.
Also Read : అరెస్ట్ ల స్ట్రాటజీ బయటపెట్టిన లోకేష్.. టీడీపీ క్యాడర్ కు మ్యాటర్ అర్ధమైందా..?
తోతాపురి మామిడికి మంచి డిమాండ్ ఉంది. సీజన్ చివర్లో వచ్చే ఈ మామిడిని చిన్నా పెద్దా అంతా ఇష్టంగా తింటారు. పైన పచ్చిగా కనిపించే ఈ మామిడిని కోసి ఉప్పు కారం వేసుకుని కూడా తింటారు. ఇది కర్ణాటకలోనే ఎక్కువగా పండిస్తారు. దీనిని చిత్తూరు జిల్లాలో విక్రయిస్తారు. అలాగే అక్కడే ఉన్న జ్యూస్ ఫ్యాక్టరీలకు కూడా పెద్ద ఎత్తున సరఫరా చేస్తారు. అయితే ఈ ఏడాది కర్ణాటక నుంచి వచ్చే తోతాపురి మామిడిపై చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆంక్షలు విధించారు. ఈ రకం మామిడి పళ్లను నిషేధిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన రెవెన్యూ, అటవీ, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు అంతర్రాష్ట్ర సరిహద్దు వద్దే వాహనాలను తనిఖీ చేసి.. తోతాపురి మామిడి రవాణాను అడ్డుకుంటున్నారు.
Also Read : కొత్త మంత్రులకు స్థానిక నాయకత్వంతో వేధింపులు…?
తోతాపురి మామిడిపై చిత్తూరు కలెక్టర్ ఆంక్షలు విధించడాన్ని లేఖలో ప్రస్తావించారు సీఎం సిద్ధరామయ్య. కర్ణాటక మామిడి రైతులకు ఇది ఇబ్బందికరమైన అంశమన్నారు. కర్ణాటక రైతులు చిత్తూరు జిల్లాలోని ప్రాసెసింగ్ యూనిట్లు, పల్ప్ కేంద్రాలకు ఎప్పటి నుంచో మామిడి సరఫరా చేస్తున్నారని.. కలెక్టర్ విధించిన ఆంక్షల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని లేఖలో ప్రస్తావించారు. ఈ అంశాన్ని తక్షణమే పరిశీలించాలని.. లేదంటే.. ఇది రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు దారి తీస్తుందని కూడా సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వివాదం రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న సహకారానికి, సమాఖ్య వ్యవస్థకూ గొడ్డలిపెట్టుగా మారుతుందని కూడా భయాందోళన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అవసరమని.. తమను సంప్రదించకుండానే నిషేధం విధించారని లేఖలో ప్రస్తావించారు. మామిడి రవాణాపై నిషేధం విధిస్తే… ఏపీ నుంచి వచ్చే కూరగాయలు, వ్యవసాయ ఉత్పత్తులపై కూడా నిషేధం విధించాలని స్టేక్ హోల్డర్లు డిమాండ్ చేస్తున్నారని లేఖలో సిద్ధరామయ్య స్పష్టం చేశారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలని.. తక్షణమే నిషేధం ఎత్తి వేయాలని విజ్ఞప్తి చేశారు.