పార్టీ కార్యాలయంలోకి వెళ్లాలంటే అనుమతి అవసరమా.. అసలు రాజకీయ పార్టీ కార్యాలయం ఎవరి కోసం.. పార్టీ కార్యకర్తలకు సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలి.. ఎలా చెప్పాలి.. సామాన్యులకు తరచూ ఎదురయ్యే ప్రశ్నలు ఇవే. వీటన్నిటికి జవాబు తెలుసుకోవాలంటే ఒకసారి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లాల్సిందే. హైదరాబాద్, మంగళగిరిలో తెలుగుదేశం పార్టీకి పెద్ద పెద్ద కార్యాలయాలున్నాయి. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ ప్రస్తుతం పార్టీ కేంద్ర కార్యాలయం. ఇక్కడ నుంచే టీడీపీ అన్ని కార్యకలాపాలు సాగిస్తోంది. ఏపీకి సంబంధించిన పార్టీ అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తల సెల్, మీడియా సెల్.. ఇలా ఏవైనా సరే మంగళగిరి కార్యాలయంలోనే ఉన్నాయి. అలాగే తెలంగాణకు సంబంధించినవి హైదరాబాద్‌లో ఉన్నాయి. ఈ కార్యాలయాల్లోకి ఎవరైనా.. వెళ్లొచ్చు. ఎవరైనా సరే.. నేరుగా కార్యాలయంలోకి వెళ్లొచ్చు. తమ విభాగానికి సంబంధించిన సమస్యను ఆయా నేతలకు వివరించవచ్చు. ఇలా వచ్చిన వారికి పార్టీ కార్యాలయంలో భోజనం కూడా ఉచితంగానే పెడతారు.
Also Read : బాబు సర్కార్ కీలక నిర్ణయం.. జగన్‌పై కూడా ఎఫెక్ట్..!
అయితే ఇదే సమయంలో ఏపీలో ఐదేళ్ల పాటు పరిపాలన సాగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి వెళ్లాలంటే.. ఇక్కడే ప్రతి ఒక్కరికి అనుమానం మొదలైంది. ఎన్నికల ముందు వరకు తాడేపల్లిలో మూడంతస్తుల భవనం ఒకటి అద్దెకు తీసుకుని అందులో పార్టీ కార్యాలయం నడిపించారు. అందులోకి వెళ్లేందుకు కొంతమందికి మాత్రమే అనుమతిచ్చారు. చివరికి పార్టీ కార్యాలయంలోకి మీడియా ప్రతినిధులకు కూడా అనుమతి లేదు. ప్రెస్ మీట్ ఏమైనా ఉంటే.. లైవ్ లింక్ ఇస్తాం.. దాని ద్వారా మీరు నడిపించండి చాలు.. అనేశారు తప్ప పార్టీ ఆఫీసులోకి మాత్రం పంపలేదు. కార్యకర్తలకు మాత్రం ప్రజాప్రతినిధి స్థాయి వరకు ఓకే అన్నారు. ఎన్నికల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అద్దె ఎందుకు దండగ అనుకున్నారో ఏమో మరి.. సైలెంట్‌గా ఖాళీ చేసేశారు. తాడేపల్లి ప్యాలెస్‌లోని ఓ మూలకు పార్టీ ఆఫీస్ మార్చేశారు. దీంతో కార్యకర్తలకే కాదు.. నేతలకు కూడా కష్టాలు మొదలయ్యాయి.
Also Read : ఉగ్రవాదిపై ట్రంప్ ప్రసంశలు.. అట్రాక్ట్ చేస్తాడంటూ కామెంట్
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లాలంటే మాత్రం ఎవరికైనా సరే అపాయింట్‌మెంట్ ఉండాల్సిందే. సాధారణంగా పార్టీ అధినేతను కలవాలంటే తప్పనిసరిగా అపాయింట్‌మెంట్ ఉండాలి. ఎందుకంటే.. ఆయనకు రకరకాల పనులుంటాయి. మరి దిగువ స్థాయి నేతను కలవాలంటే.. అపాయింట్‌మెంట్ అవసరం లేదు. నేరుగా వెళ్లి ఆఫీసులో కలిసి.. వారి సమస్యలు వివరించి.. ఓ వినతి పత్రం సమర్పించి వెళ్లిపోవచ్చు. కానీ వైసీపీలో మాత్రం పరిస్థితి పూర్తిగా విరుద్ధం. కార్యాలయం లోపలికి కాదు కదా.. చివరికి తాడేపల్లి ప్యాలెస్ గేటు దాటాలన్నా సరే.. అనుమతి తప్పనిసరి. వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, సమన్వయ కర్త.. లేదా ముఖ్యనేతలు.. ఇలా ఎవరో ఒకరితో తప్పనిసరిగా అనుమతి లేఖ తెచ్చుకోవాల్సిందే. అలా లేఖ లేదంటే.. ప్యాలెస్‌లో ఉండే పార్టీ నేతల నుంచి గేటు దగ్గర సిబ్బందికి ఫోన్ అయినా చేయించాలి. అలా అయితేనే ఎవరినైనా లోపలికి పంపాలని ప్యాలెస్ పెద్దలు సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు. దీంతో వారు తూ చా తప్పకుండా పాటిస్తున్నారు.
Also Read : విదేశీ ఆటగాళ్ళు వచ్చేస్తున్నారు.. ఐపిఎల్ కు స్టార్ లు
వాస్తవానికి వైసీపీ ఓటమికి ప్రధాన కారణం.. పార్టీ అధినేతకు కార్యకర్తకు మధ్య దూరమే. పాదయాత్ర చేస్తున్న సమయంలో.. ప్రతి ఒక్కరి నెత్తి మీద చెయ్యి వేసిన జగన్.. నుదుటి మీద ముద్దు పెట్టి.. మీరే నా దేవుళ్లు అన్నారు. ఇక అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు పరదాల మధ్య తిరిగారు. ప్యాలెస్ గేటు దాటి బయటకు రాలేదు. పార్టీ కార్యకర్తతో నేరుగా మాట్లాడిన సందర్భం లేదు. చివరికి సొంత పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా జగన్ అపాయింట్‌మెంట్ దొరకలేదు. కేవలం ఓ నలుగురి చేతుల్లోనే పార్టీ నడిచింది. వాళ్లు చెప్పిందే వేదం.. చేసిందే చట్టం అన్నట్లుగా ఐదేళ్ల పాటు పార్టీ నడిచింది. దీంతో పార్టీ అధినేతపైన, నేత పైన కూడా కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. చివరికి పార్టీ ఓడిన తర్వాత కూడా నేతల తీరులో మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు అధికారంలో ఉన్నా లేకున్నా సరే టీడీపీ కార్యాలయంలోకి ఎవరైనా, ఎప్పుడైనా వెళ్లొచ్చు.. కానీ వైసీపీ కార్యాలయంలోకి మాత్రం ఓడినా కూడా అనుమతి ఇవ్వటం లేదంటే.. వీళ్లు ఇంక మారేది ఎప్పుడు అని సగటి కార్యకర్త ప్రశ్నిస్తున్నారు. క్యాడర్‌ను వైసీపీ పెద్దలు పట్టించుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.