ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తోంది. ఎన్నికలప్పుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అంటూ కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ నేతలు పదే పదే ప్రశ్నిస్తున్నారు. పథకాల అమలులో కూటమి సర్కార్ విఫలమైందని పదే పదే ఆరోపిస్తోంది కూడా. సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన హామీలు అమలు చేస్తున్నప్పటికీ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలు ఎప్పుడూ అంటూ ప్రభుత్వాన్ని వైసీపీ నేతలు నిలదీస్తూనే ఉన్నారు. పైగా జగన్ బటన్ నొక్కి ప్రతి ఒక్కరి ఖాతాలో డబ్బులు వేశారు.. ఆ బటన్ నొక్కడం మీకు చేతకావటం లేదా అని ఎద్దేవా చేస్తున్నారు.
Also Read : కోహ్లీ ఆస్తుల విలువ తెలుసా..?
ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో ప్రధానంగా సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టాలని నిర్ణయించారు. ముఖ్యంగా మహానాడు నిర్వహణపై చర్చించిన పొలిట్ బ్యూరో.. సంక్షేమ పథకాల అమలుపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది. దీపం పథకం నగదును ముందుగానే చెల్లించాలని పొలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకున్నారు. సిలిండర్ బుకింగ్‌కు ముందే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయాలని నిర్ణయించారు. ఏడాదిలో 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఎన్నికల ముందే చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే దీపం-2 పథకంలో భాగంగా ఇప్పటికే నగదు చెల్లిస్తోంది కూడా. అయితే ఇకపై ఈ నగదును ఒకేసారి చెల్లించాలని నిర్ణయించారు. ఏడాదిలో ఒక నెలలో 3 సిలిండర్ల నగదు ఒకేసారి చెల్లించనున్నారు. సిలిండర్ తీసుకోకపోయినా కూడా 3 సిలిండర్ల నగదు ఒకేసారి చెల్లిస్తారు.
Also Read : అంగరంగ వైభవంగా పసుపు పండుగ..!
ఇకపై ప్రతినెలా సంక్షేమం అందేలా ఏడాది సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయాలని నిర్ణయించారు. అలాగే ప్రభుత్వం ఏర్పడిన జూన్ 12న లక్ష మంది ఒంటరి మహిళలు, వితంతువులకు కొత్తగా పింఛన్లు ఇవ్వనున్నారు. గత ప్రభుత్వం నిలుపుదల చేసిన పింఛన్లు పునరుద్ధరించనున్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు కూడా ప్రభుత్వం ఏర్పడిన జూన్ 12నే ప్రారంభించనున్నారు. చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే తల్లికి వందనం పథకం డబ్బులు తల్లుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక కీలకమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 2 నెలల్లో ప్రారంభించేలా చర్యలకు నిర్ణయం తీసుకున్నారు. 2014-19 మధ్య పనులు చేసిన వారికి పెండింగ్ బిల్లులు చెల్లించనున్నారు. my tdp పేరిట పార్టీకి ఒకే అధికారిక యాప్ తీసుకురానున్నారు. జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి కూడా పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది.