ఆంధ్రప్రదేశ్ లో గత 5 ఏళ్ళలో ప్రతీ శాఖలోనూ అవినీతి జరిగింది అనేది టీడీపీ నేతలు చేసే ప్రధాన ఆరోపణ. వైసీపీ నేతలు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దోచుకున్నారు అనేది టీడీపీ ఆరోపిస్తుంది. రుణాల పేరుతో… సహకార బ్యాంకులను కూడా నాశనం చేసారని ఆరోపణలు వచ్చాయి. తాజాగా దీనిపై పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్.. సంచలన వ్యాఖ్యలు చేసారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన… సహకార బ్యాంకుల్లో జరిగిన అవకతవకలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేసారు.
Also Read: వైసీపీ ఎమ్మెల్సీని ఆడుకున్న మంత్రులు
సహకార బ్యాంకుల్లో రుణాల పేరుతో జరిగిన అవినీతిని ప్రస్తావించిన ధూళిపాళ్ళ.. జగనన్న పాల వెల్లువ, జగనన్న తోడు, డ్వాక్రా మహిళలకు రుణాల పేరుతో బినామీలకు డబ్బులిచ్చేశారని ఆయన సభ దృష్టికి తీసుకు వచ్చారు. పట్టణాల్లో అమలు చేసే స్కీంలకు గ్రామీణ రైకులకు చెందిన సెంట్రల్ బ్యాంకు నుంచి రుణాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున బినామీలకు రుణాలు ఇచ్చేశారన్న నరేంద్ర… ఇప్పుడు ఆ రుణాలను తిరిగి చెల్లించేవాళ్లే లేరన్నారు.
Also Read: కూటమి పార్టీలను విడగొట్టడానికి ఎవరో రానవసరం లేదు..!
గుంటూరు సెంట్రల్ బ్యాంకులో అవినీతిపై తాను గట్టిగా అడిగితేనే విచారణ వేశారని ధూళిపాళ్ళ పేర్కొన్నారు. ఆప్కాబ్ స్థాయి నుంచి మొదలుకుని.. గ్రామీణ స్థాయి బ్యాంకుల వరకు జరిగిన అవకతవకలపై ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించి విచారణ జరిపించాలని సభలో డిమాండ్ చేసారు. ఆప్కాబ్ ఎండీగా గత ప్రభుత్వం నియమించిన వారే ఇంకా కొనసాగుతున్నారని.. ఆప్కాబ్ ఎండీ సహా సహకార బ్యాంకుల్లో ఉన్న వారిని బదిలీలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.




