టీడీపీ – జనసేన మధ్య రోజు రోజుకూ దూరం పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. ఇందుకు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ బీజం వేసినట్లు తెలుస్తోంది. తొలి నుంచి టీడీపీ నేతలపై జనసేన పెత్తనం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే టీడీపీతో జనసేన పొత్తు 15 ఏళ్ల పాటు కొనసాగుతుందని అసెంబ్లీ వేదికగా పవన్ ప్రకటించడంతో అంతా సైలెంట్ అయ్యారు. ఇదే సమయంలో పవన్ కోసం పిఠాపురం సీట్ త్యాగం చేసిన వర్మకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని గతంలోనే చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో పిఠాపురంలో పవన్ గెలుపు కోసం వర్మ సహకరించారు. గెలిచిన తర్వాత పవన్ కూడా వర్మను మెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. వర్మ ఏదో విమర్శలు చేశారంటూ జనసేన నేతలంతా వర్మపై ఎదురుదాడి మొదలుపెట్టారు.
Also Read : సునీత విలియమ్స్ జీతం ఎంత..? ఈ 9 నెలలకు ఆమె ఎంత తీసుకుంటుంది..?
ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా వర్మకు అవకాశం వస్తుందని అంతా భావించారు. కానీ ఆ ఛాన్స్ నాగబాబు కొట్టేశారు. ఆ తర్వాత నుంచి టార్గెట్ వర్మ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. పిఠాపురంలో జరిగిన జనసేన సభలో ఖర్మ అంటూ నాగబాబు పరోక్షంగా వర్మను ఉద్దేశించే వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీ నేతలు, వర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూడా. అసలు నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తి ఇక్కడి పరిస్థితుల గురించి ఎలా మాట్లాడుతారని కూడా వర్మ అభిమానులు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో వీటికి చెక్ పెట్టేందుకు పవన్ స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో కూడా పిఠాపురం నియోజకవర్గం పూర్తిగా జనసేన పార్టీ చెప్పుచేతల్లో ఉండాలనేలా పవన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : రాజమౌళి – మహేష్ మూవీ లీక్.. టెక్నీషియన్ కు భారీ జరిమానా
వర్మకు ఎమ్మెల్సీ అవకాశం రాకుండా చేశారంటూ పవన్‌పై వస్తున్న విమర్శలకు మంత్రి నాదెండ్ల మనోహర్ చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. వర్మకు టికెట్ ఇచ్చేది లేనిది టీడీపీ అధినేత పరిధిలో ఉన్న అంశమని.. దానికి జనసేనతో ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే వర్మపై పిఠాపురం నియోజకవర్గంతో ఎలాంటి సంబంధం లేని నాగబాబు విమర్శలు చేస్తే.. అది భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తీసుకువచ్చే ప్రమాదం ఉందని జనసైనికులు గుర్తించారు. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్.. పిఠాపురం నియోజకవర్గ బాధ్యతలను నాగబాబుకు అప్పగించినట్లు తెలుస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో నాగబాబు వరుస పర్యటనలు చేస్తున్నారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పవన్ తరఫున పారిశుధ్య కార్మికులను నాగబాబు సన్మానించారు. పిఠాపురం నియోజకవర్గంలోని అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. వర్మకు పదవి లేదు.. నాగబాబు ఎమ్మెల్సీ కాబట్టి.. అధికారులు కూడా ఆయనకే జవాబు చెబుతున్నారు. అటు జనసేన పార్టీ నేతలు కూడా ఇకపై పిఠాపురం ఇంఛార్జ్‌గా నాగబాబు వ్యవహరిస్తారంటూ ప్రచారం చేస్తున్నారు.