తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గేర్ మార్చారు. ఇప్పటివరకు కాస్త చూసి చూడనట్లు వ్యవహరిస్తూ వెళ్లిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు సొంత పార్టీ నేతల విషయంలో కూడా కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నారు. కొంతమంది నాయకులు అలాగే ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కఠినంగానే ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమవుతుంది. తాజాగా సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి తో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు.
Also Read : పార్టీ క్యాడర్ ను ముంచుతున్న ఎమ్మెల్యే…?
ప్రభుత్వ విప్ లు, అలాగే ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ పీకారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తుంటే.. మీరేం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను నిలదీశారు. మనం లిక్కర్ పాలసీ తీసుకొచ్చామని.. వాళ్లకు పాలసీ లేకుండా వచ్చింది వెనక్కి వేసుకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ విప్ లు పనితీరు మార్చుకోవాలని సూచించారు.
Also Read : అసెంబ్లీలో మంత్రులను ఇబ్బంది పెడుతున్న అధికారులు
కేటాయించిన సభ్యులు అన్ని విషయాలపై అవగాహన కల్పించుకోవాలని.. అందరూ అన్ని విషయాలు మాట్లాడాలని.. పట్టుదలగా పని చేయాలని రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు సూచించారు. ఒక్కొక్క విషయాన్ని ఎంపిక చేసుకోవాలని ఫ్లోర్ కో ఆర్డినేషన్ పగడ్బందీగా చేయాలని సూచించారు. ఎమ్మెల్యేలకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తనకు వచ్చి చెప్పే అవకాశం కల్పించానని.. అయినా కొంతమంది ఎమ్మెల్యేలు సొంతగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. అనవసరంగా ప్రతిపక్షాలకు అలాగే రాజకీయ ప్రత్యర్థులకు అవకాశం కల్పించకుండా పరిపాలన ఉండాలని, అసెంబ్లీలో బలంగా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల గురించి ప్రజలకు వాస్తవాలు చెప్పాలని రేవంత్ రెడ్డి స్పష్టంగా పేర్కొన్నారు.