తెలుగుదేశం పార్టీలో ఎక్కడ చూసినా సరే.. ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవుల పైనే చర్చ నడుస్తోంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్లుగా ప్రతి ఒక్కరు తమ తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇబ్బందులు పడిన నేతలంతా తమకు పదవి వస్తే బాగుండూ అని ఆశిస్తున్నారు. ఇక ఎన్నికల సమయంలో అధినేత ఆదేశాల మేరకు సీట్లు త్యాగం చేసిన నేతలు కూడా ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో పట్టుకోసం తమ వంతు ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలకు దూరంగా ఉంటున్నప్పటికీ.. అధినేతను మాత్రం ప్రసన్నం చేసుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఇదే సమయంలో పార్టీ మారిన నేతలు కూడా తమకు ఏదో ఒక పదవి ఇస్తే బాగుంటుంది కదా తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read : గెలిచినా… ఉపయోగం లేకుండా పోయిందే..!
ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 5 స్థానాలు కూడా కూటమి ఖాతాలోకే చేరనున్నాయి. వీటిల్లో ఒక స్థానం తరఫున జనసేన పార్టీ నేత నాగబాబు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఇక మిగిలిన నాలుగు స్థానాల్లో ఒకటి బీజీపీకి ఇస్తారనే ప్రచారం నడుస్తోంది. అయితే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యేలు వర్మ, వంగవీటి రాధ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీంతో ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం టికెట్ త్యాగం చేసిన నేతలంతా ఇప్పుడు నామినేటెడ్ పదవి కోసం తమ వంత ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ దిశగా ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు కూడా. దీంతో ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని మాజీలు డిమాండ్ చేస్తున్నారు కూడా.
Also Read :ఒక్క వీడియోతో లోకేష్ ఆన్సర్ ఇచ్చేసారా..?
శ్రీకాకుళం జిల్లా నుంచి ఇద్దరు మాజీలు కలమట వెంకటరమణ, గుండ లక్ష్మీదేవి ఎన్నికల తర్వాత సైలెంట్ అయిపోయారు. గుండ లక్ష్మిదేవి అమెరికా వెళ్లగా… కలమట మాత్రం వైజాగ్‌లో సొంత వ్యాపారాలపై దృష్టి పెట్టారు. అయితే నియోజకవర్గాల్లో తమ పట్టు జారిపోతుందనే భయంతో… పదవుల కోసం తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అటు చీపురుపల్లి నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ కిమిడి నాగార్జున కూడా నామినేటెడ్ పదవి కోసం ఆశపడుతున్నారు. సొంత బాబాయ్ కళావెంకట్రావు కోసం టికెట్ త్యాగం చేసినప్పటికీ… తనను కూడా గుర్తించాలంటూ అధినేతకు లేఖలు రాస్తున్నారు. ఇక తాడేపల్లిగూడెం టీడీపీ నేత ముళ్లపూడి బాపిరాజు కూడా పదవి ఆశిస్తున్నారు. గతంలో కూడా బీజేపీ కోసం ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిన బాపిరాజుకు జెడ్పీ చైర్మన్ పదవి దక్కింది. ఈసారి కూడా అలాగే నామినేటెడ్ పదవి వస్తుందని ఆశిస్తున్నారు. ప్రొద్దుటూర్ టికెట్ త్యాగం చేసిన డా.ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా నామినేటెడ్ పదవిపై గంపెడాశలు పెట్టుకున్నారు. గతంలోనే ప్రవీణ్‌కు లోకేష్ హామీ ఇచ్చారు. ప్రవీణ్‌కు పూర్తిస్థాయిలో అండగా ఉంటామని లోకేష్ స్వయంగా హామీ ఇచ్చారు. దీంతో ఈ జాబితాలో ప్రవీణ్ కుమార్ రెడ్డి పేరు తప్పకుండా ఉంటుందని ఆశిస్తున్నారు.