వైసిపి అధినేత వైయస్ జగన్ ఏ పని చేసినా బూమ్ రాంగ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే తాడు పట్టుకున్న సరే అది పామై కరుస్తుంది. వై నాట్ 175 అంటే.. 11 చాలు అని ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు. పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో కొద్దిరోజులపాటు సైలెంట్ గా ఉన్న జగన్… అసెంబ్లీకి దూరంగా ఉండడంపై విమర్శలు వెల్లువెత్తడంతో పార్టీ మనుగడ కోసం ప్రజల్లో సింపతి సాధించేందుకు నెలకోసారి ఏపీలో పర్యటిస్తున్నారు. లేని సమస్యను సృష్టించి దానికోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు. తాజాగా మిర్చి రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గుంటూరు మిర్చి యార్డులో రైతులను పరామర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు కనీస మద్దతు ధర రూ.7,000 మాత్రమే ఇచ్చిన విషయాన్ని మర్చిపోయిన వైయస్ జగన్.. ఇప్పుడు మాత్రం ఏకంగా రూ. 15,000 ఇచ్చి రైతులను ఆదుకోవాలంటూ మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు.
Also Read : వైసీపీ ప్రతాపం అంతా అక్కడేనా?
మిర్చి రైతుల పరామర్శ సమయంలో జగన్ వ్యవహరించిన తీరుపై ఇప్పుడు విమర్శలు వెలువెత్తుతున్నాయి. రైతులను పరామర్శించేందుకు వచ్చిన సమయంలో జగన్ మెడలో ఆకుపచ్చ కండువా వేసుకున్నారు. మిర్చి ఘాటుకు అది ఆకుపచ్చ కండువాను ముఖానికి అడ్డుగా కూడా పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఆ కండువా నే జగన్ ను మరోసారి ఇరుకున పెట్టింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మూడు రాజధానులు అంటూ విచిత్రమైన ప్రతిపాదనను తెరపైకి తీసుకొని వచ్చారు జగన్. దీంతో అమరావతి రైతులు ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో అమరావతి రైతులంతా మెడలో ఆకుపచ్చ కండువాలు మాత్రమే వేసుకొని దీక్షలు, నిరసనలు, పాదయాత్రలు చేశారు. అలా చేయటం పట్ల అప్పట్లో జగన్ సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా. చివరికి అమరావతి రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు వైసీపీ నేతలు. ఒక దశలో దుర్గ గుడికి వెళ్తున్న మహిళా రైతులను అడ్డుకున్న పోలీసులు… వారి మెడలో ఉన్న ఆకుపచ్చ కండువా తీసేంతవరకు గుడికి అనుమతించేది లేదు అంటూ హుకుం జారీ చేశారు. అందుకు ససేమిరా అన్న మహిళా రైతులపై లాఠీ ఛార్జ్ చేసి అరెస్టు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
Also Read : ఏపీపై కేంద్రం మరోసారి స్పెషల్ లవ్
చివరికి జగన్ అసెంబ్లీకి వెళ్తున్న సమయంలో అమరావతి రైతులు కనిపించకూడదు అన్నట్లుగా పరదాలు కట్టారు గత ప్రభుత్వ పెద్దలు. అమరావతి రైతులు అటు తిరుమల, ఇటు అరసవిల్లి వరకు చేపట్టిన పాదయాత్రలకు వైసీపీ నేతలు ఎన్నో ఆటంకాలు కల్పించారు కూడా. చివరికి ఉభయగోదావరి జిల్లాల్లో దాడులకు కూడా తెగించారు. అలాంటి వైసిపి నేతలు ఈరోజు రైతు సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆందోళనలు చేయటం విడ్డూరంగా ఉందనేది వాస్తవం. ఇక ఆకుపచ్చ కండువానే కనపడకూడదు అనుకున్నా జగన్… ఈరోజు అదే కండువా మెడలో వేసుకుని రైతుల దగ్గరికి వెళ్లడం ఏమిటని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు నేతలు అయితే జగన్ అసలు నీకు ఆ అర్హత ఉందా అంటూ నిలదీస్తున్నారు కూడా. మరి కూటమి నేతల ప్రశ్నలకు వైసీపీ నేతలు ఏరకంగా సమాధానం ఇస్తారో చూడాలి.