కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుపై తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన ఎంపీగా వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ హీరో అని అనిపించుకున్నారు. దీంతో ఎన్డీయే ప్రభుత్వ కేబినెట్‌లో చిన్న వయస్కుడైన మంత్రిగా రికార్డుల్లో కూడా ఎక్కాడు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీ వ్యవహరిస్తున్న తీరు పట్ల టీడీపీ క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తోంది. ఎవరైతే గతంలో పార్టీని ఇబ్బందులు పెట్టారో… పార్టీ అధినేతపై విమర్శలు చేశారో వాళ్లతోనే కలిసి మెలిసి తిరుగుతున్నారు. వారికి దగ్గరుండి మరీ రాచమర్యాదలు చేస్తున్నారు. ఇదే ఇప్పుడు టీడీపీ నేతలతో పాటు కార్యకర్తలను కూడా ఇబ్పందులకు గురి చేస్తోంది.
Also Read : టీడీపీ ఆఫీస్ కు నాగార్జున.. కారణం ఏంటీ..?
ఢిల్లీలో రామ్మోహన్ నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందీ భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌తో చాలా సన్నిహితంగా ఉన్నారు. లక్ష్మీప్రసాద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్ ఇప్పించారు. అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్ర హిందీ వర్షన్ పుస్తకాన్ని నాగార్జున కుటుంబంతో కలిసి ప్రధానికి అందించారు. ఇందులో ఎలాంటి తప్పు లేకపోయినా… కింజరాపు రామ్మోహన్ తీరు మాత్రం వివాదాస్పదమవుతోంది. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు రామ్మోహన్ సహకరించడం పట్ల తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. ఎందుకంటే గతంలో యార్లగడ్డ వ్యవహరించిన తీరుపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. వాస్తవానికి యార్లగడ్డకు గుర్తింపు వచ్చిందే చంద్రబాబు హయాంలో. అయితే ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసినట్లుగా… వైఎస్ఆర్‌కు మద్దతు పలికారు. ఆ తర్వాత చంద్రబాబుపై విమర్శలు చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ పార్టీ మార్చేశారు. నాటి బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబుతో కలిసి రాజకీయాలు చేశారు.
Also Read : బాలయ్యను అడ్డంపెట్టి రేవంత్ ను బుట్టలో వేస్తారా..?
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి తన బుద్ది బయటపెట్టారు యార్లగడ్డ. జై జగన్ అనేసి.. మరోసారి హిందీ భాషా సంఘం అధ్యక్ష పదవి దక్కించుకున్నారు. అంతే కాకుండా… చంద్రబాబుకు వ్యతిరేకంగా పత్రికల్లో ఆర్టీకల్స్ కూడా రాశారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. మరో అడుగు ముందుకు వేసిన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్… ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేయవద్దని… మరోసారి జగన్‌ను గెలిపించాలంటూ ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు. అయితే ఆయన అంచనాలు తల్లకిందులు అయ్యాయి. కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు మళ్లీ తనలోని ఊసరవెల్లిని బయటకు తీశారు. వైసీపీ నేతలను వదిలేసి… టీడీపీ నేతలతో రాసుకుని, పూసుకుని తిరుగుతున్నారు. ఇలాంటి వ్యక్తికి కింజరాపు రామ్మోహన్ నాయుడు సహకరించడం పట్ల తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
Also Read : బై బై కేజ్రివాల్.. సచివాలయం సీజ్..!
కేంద్ర మంత్రి పదవి వచ్చిన నాటి నుంచి రాము తీరు వివాదాస్పదమవుతోంది. ముందుగా వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నేతలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఐఏఎస్ అధికారి శ్రీకేశ్ బాలాజీ లత్కర్‌ను తన పీఎస్‌గా పెట్టుకున్నారు రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో శ్రీకేష్ బీ లత్కర్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారనేది జిల్లా టీడీపీ నేతల ఆరోపణ. అలాంటి వ్యక్తిని తన పీఎస్‌గా పెట్టుకోవడంపై ఇప్పటికీ సిక్కోలు జిల్లా నేతలకు మింగుడు పడటం లేదు. ఈ నెల 4వ తేదీన రధసప్తమి పండుగ సందర్భంగా చంద్రబాబుపై విమర్శలు చేసిన సింగర్ మంగ్లీని వెంటబెట్టుకుని మరీ తీసుకెళ్లిన రాము… ప్రోటోకాల్ దర్శనం చేయించారు. ఈ దుమారం సద్దు మణగక ముందే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌తో రాము చెట్టాపట్టాలేసుకుని తిరగడంపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరి ఈ వివాదానికి చంద్రబాబు ఎలా చెక్ పెడతారో చూడాలి.