మాట తప్పను.. మడమ తిప్పను.. అనేది వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట. వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఇదే నిజమంటూ తెగ ప్రచారం చేస్తారు. జగన్ చెప్తే చేసి తీరుతాడు అంటూ ఎలివేషన్స్ కూడా ఇస్తారు. అదే సమయంలో ప్రజల కోసం ఎప్పుడు ముందు ఉంటారని… ప్రజా సమస్యల పోరాటంలో జగన్ వెనక్కి తగ్గేదే లే అంటూ భారీ డైలాగులు కూడా చెబుతుంటారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత అసెంబ్లీకి ఎందుకు రావడం లేదంటే మాత్రం సైలెంట్ అయిపోతారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో చర్చించవచ్చు కదా అంటే ముఖం చాటేస్తారు. జగన్ అసెంబ్లీకి రాకపోవడంతో వైసీపీ నేతల్లోనే ఆయనపై నమ్మకం సన్నగిల్లింది. ఈ మధ్య కాలంలో జగన్ గురించి గొప్పగా చెప్పడం తగ్గించేశారు కూడా.
Also Read : టీడీపీ పొలిట్‌బ్యూరో మీటింగ్.. ఇవే కీలకం..!
తాజాగా జగన్ గురించి ఓ విషయంపై సొంత పార్టీలోనే తెగ చర్చ నడుస్తోంది. ఏపీలో ఎన్నికల నగారా మోగింది. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. రెండు పట్టభద్రుల స్థానాలకు, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మార్చి 3న లెక్కింపు ఉంటుంది. ఈ ఎన్నికల కోసం ఇప్పటికే కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేస్తుందా.. లేదా.. అనే విషయంపై పార్టీలో విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఈ మూడు స్థానాలకు ఎన్నికలు ప్రత్యక్ష ఓటింగ్ విధానంలో జరగనున్నాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయటం లేదని జగన్ ప్రకటిస్తే మాత్రం… వైసీపీ నేతల్లో ఉన్న కొద్దిపాటి ఆత్మస్థైర్యం కూడా పోతుంది. పార్టీ అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపకపోతే మాత్రం వైసీపీపై పూర్తిగా జనంలో నమ్మకం పోవడం ఖాయమంటున్నారు సొంత పార్టీ నేతలు.
Also Read : వైఎస్ ఫ్యామిలీ సేవలో కూటమి సర్కార్..
కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో గెలుపు కష్టమని భావించిన కూటమి నేతలు.. పోటీకి దూరంగా ఉన్నారు. దీంతో మాజీ మంత్రి, బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశారు జగన్. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి… ఓడిపోతామనే భయంతోనే కూటమి పోటీ చేయలేదని ప్రచారం చేశారు. అయితే గతేడాది డిసెంబర్ 5న జరిగిన ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మాత్రం వైసీపీ పోటీ చేయలేదు. పోలీసుల సాయంతో అక్రమ అరెస్టులు చేస్తున్నారని… ప్రభుత్వం పూర్తి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించిన జగన్… ఎన్నిక సక్రమంగా జరుగుతుందనే నమ్మకం లేదని.. అందుకే పోటీ చేయడం లేదని ప్రకటించారు.
Also Read : టిడ్కో ఇళ్ళ వెనుక విధ్వంసం బయటపెట్టిన మంత్రి…!
కానీ ఇటీవల జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు పెట్టినా సరే.. వైసీపీ ఘన విజయం సాధిస్తుందని గొప్పగా ప్రకటించారు. అదే సమయంలో మరో నాలుగు నెలల్లో ప్రభుత్వం మారిపోతుందంటూ ఇటీవల కడప జిల్లా పర్యటనలో డీఎస్పీకి వార్నింగ్ కూడా ఇచ్చారు. మరి అదే నిజమైతే… ఈ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయడం చాలా అవసరం. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో నిజంగానే వ్యతిరేకత ఉందని నిరూపించాల్సిన అవసరం ఉందంటున్నారు వైసీపీ నేతలు. ప్రభుత్వం నిజంగా తప్పులు చేస్తే… వాటిని పట్టభద్రులకు వివరించాల్సిన అవసరం వైసీపీ నేతలపైనే ఉంది. కానీ జగన్ తీరు చూస్తే మాత్రం.. ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉంటుందనే మాట బలంగా వినిపిస్తోంది. ఓ వైపు నోటిఫికేషన్ విడుదలైంది. అయినా సరే ఇప్పటి వరకు అభ్యర్థులను వైసీపీ ప్రకటించలేదు. పైగా జగన్ కూడా లండన్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ మడమ తిప్పడం ఖాయమంటున్నారు సొంత పార్టీ నేతలు.