ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేసారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న తులసి బాబును మూడు రోజులు పాటు పోలీస్ కస్టడీకి గుంటూరు జిల్లా కోర్టు అనుమతి ఇవ్వడంతో సోమవారం ఉదయం ప్రకాశం జిల్లా పోలీసులు జైల్లో ఉన్న తులసి బాబును అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడే దాదాపు 5 గంటల పాటు వైద్యులు పర్యవేక్షణలో తులసి బాబు ఉండగా అనంతరం ఒంగోలుకు తరలించి అక్కడ విచారణ చేశారు.
Also Read : జనసైనికులకు వార్నింగ్.. బీ కేర్ ఫుల్..!
సమయం ఎక్కువగా లేకపోవడంతో సోమవారం రాత్రి 8 గంటల నుండి 9:30 గంటల వరకు విచారణ జరిపారు. కేసు విచారణలో భాగంగా కీలక ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. సిఐడి చీఫ్ సునీల్ కుమార్ తో తులసి బాబుకు ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీసినట్టు సమాచారం. ఇక ఈ సందర్భంగా కొన్ని కీలక ప్రశ్నలను సంధించినట్లు వార్తలు వస్తున్నాయి. సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ను కలవాలంటే పోలీసులకు మాత్రమే అనుమతి ఉందని.. అలాంటిది నేరుగా వెళ్లి ఎలా కలిసేవాడివి, దాడి జరిగినప్పుడు రఘురామ ఉన్న గదిలోకి వచ్చిన ఐదుగురు వ్యక్తులు ఎవరు అంటూ తులసి బాబుని పలు ప్రశ్నలు వేశారు.
Also Read : వైసీపీలో లోఫర్లు ఎక్కువ.. జగన్ పై వసంత సంచలన కామెంట్స్
అయితే ఈ విచారణలో ఒకే ఒక వ్యక్తి పేరును తులసి బాబు బయటపెట్టినట్టు సమాచారం. సునీల్ కుమార్ ను తనకు దగ్గర చేసింది ఆ వ్యక్తి అని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే రఘురామకృష్ణం రాజును హింసించిన విషయంలో మాత్రం తనకే సంబంధం లేదని… తాను కొట్టలేదని తులసి బాబు చెప్పాడట. విజయ్ పాల్ తో కలిసి తులసి బాబును విచారించిన పోలీసులు ఆ తర్వాత విజయ్ పాల్ ను పంపించేసి తులసి బాబును ఒంటరిగా విచారించారు. ఈ సమయంలోనే అతని ఫోన్ లో ఉన్న కొన్ని కీలక విషయాలను.. చూపించి తులసి బాబుని విచారించారట పోలీసులు. వాటిపై తులసి బాబు మౌనంగానే ఉండిపోయినట్లు సమాచారం. అలాగే వాట్సాప్ చాట్ తో పాటుగా కొన్ని ఫోటోలు కూడా పోలీసులు తులసి బాబు ముందు ఉంచగా వాటిపై మౌనం వహించినట్లు తెలుస్తోంది.